తొలి ఏకాదశి . పేలాల పండుగ

శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం
విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం 
వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం!!
పరమాత్ముడికి ఐదు విభూతులు అని పేరు. అందులో
మొదటిది వైకుంఠంలో ఉండే ఆ శ్రీమహవిష్ణువుది పర అంటారు.ఈ స్వామి యోగనిద్రలోకి వెళ్ళి మన తప్పుఒప్పులను లెక్కలువేసి మన తదుపరి జన్మను నిర్ణయించే తత్త్వం .రెండోది క్షీరసాగరంలో వాసుకి మీద శయనించి ఉండే ఆ పరమాత్ముడిది, దీనినే వ్యూహం అంటారు.మూడోది అవతారాలలో ఉండే స్వామి అంటే రాముడు, కృష్ణుడు..వీరిని విభవము అంటారు.నాలుగోది, సర్వ జీవుల హృదయాలలో ఉండే స్వామిని అంతర్యామి అంటారు.ఐదోది మనము రోజు ఇంట్లో పూజించే స్వామి, అర్చ్యామూర్తీ అంటారు.
మనము విన్నవించే విన్నపాలు, మన పూజలు స్వీకరించేది మన ఇంట్లో ఉండే అర్చ్యామూర్తీ.కనుక నిస్సందేహంగా ఆయనను పూజించి మీరు తెలిసితెలియక చేసిన తప్పులకు ఆయనను క్షమించమని మనస్పూర్తిగా వేడుకుని, మంచి జన్మను ప్రసాదించమని వేడుకోండి.


మనందరం జీవులం. జీవుడికి,దేవుడికి తేడా ఏమిటో తరచి చూడండి. నేను నా పొట్ట అనుకొనే జీవదశ నుండి అంతానేనే అనే మహత్తర లోకోత్తర స్థితిలో స్థిరంగా ఉన్నవాడే దేవుడు. 

పూర్వం ఆషాడ శుద్ధ ఏకాదశినే సంవత్సరారంభంగా భావించేవారు కాబట్టి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. 
వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఆషాడ మాసం  మొదలుకొని 4 మాసాలవరకు వర్షఋతువు కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు,.వ్రతం అంటే దంపతులిద్దరూ కలిసి   ఆచరించే ఆరాధన .  
గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.

విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. 

సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. అందుకే ఉపవాసం లాంటి దేహశుద్ధి ఉపాయాలను ఆచారాలుగా మహర్షులు సమాజానికి అలవాటుచేశారు. 

ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.

తొలిఏకాదశి వచ్చిందంటే ఇక వరుసగా పండుగలు వస్తాయన్నమటే! అప్పటికి రెండు నెలలుగా ఎలాంటి పండుగలూ లేక బోసిపోయిన ఇళ్ళకి కొత్తకళ వస్తుంది. ఈ ఏకాదశితో మొదలుపెడితే వెంటనే గురుపూర్ణిమ వస్తుంది. ఆషాడం వెళ్ళగానే శ్రావణమాసం నోములు, వ్రతాలు, తరువాత వినాయకచవితి, ఆపై దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి............. ఇలా సాగిపోతుందా చిట్టా.
ఈరోజున ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు.
చాలా ప్రాంతాల్లో తొలి ఏకాదశినాడు "గోపద్మవ్రతం" చేస్తారు. అంటే గోవును పూజించడం అన్నమాట. ఈ నాలుగు నెలలు వర్షా కాలం కాబట్టి పశువుల కొట్టాలను శుభ్రం చేసి వాటికి ఎలాంటి అనారోగ్యం రాకుండా కాపాడుకునే ప్రయత్నం ఇది . 

సాధకులు అనగా సనాతన ధర్మాన్ని ప్రగాఢంగా నమ్మి, తమ లోని జీవుడిని ప్రక్షాళన గావించి   ఉద్ధరింప బడాలనుకొనే వారు ,  సంచితకర్మలు క్రమేణా భస్మమై ,ప్రారబ్ద కర్మను సునాయాసంగా అనుభవించే ధీశక్తి కావాలనుకునేవారు  మరిన్ని నియమనిష్టలను పాటించాలి. 
 ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం,పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు అంటున్నారు.ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ,హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు.. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు  రుచి తెలుస్తుంది ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు.
 వ్రతదీక్షాపరులు దైవచింతనలోనే కొనసాగాలి. ద్వాదశినాడు అతిథిలేకుండా భుజించ రాదు. ద్వాదశినాడు ఉదయమే నిత్య పూజలు చేసి - "కేశవా! అజ్ఞానమనే అంధకారం చేత అంధుడనైన నాకు వ్రతఫలం గా జ్ఞానదృష్టిని అనుగ్రహించు అనే ప్రార్ధనాపూర్వకమైన మంత్రాన్ని పఠించాలని ధర్మసింధు చెబుతోంది. ఇలా నియమాలను పాటిస్తూ, ఉపవాస దీక్షతో, ఇంద్రియ నిగ్రహం తో, శ్రద్దాభక్తులతో ఆచరించే ఏకాదశీ వ్రతంవల్ల పాపకర్మలు తగ్గి చిత్తశుద్ధి స్థిరమైతుంది. ఆచారాలను హేళన చేయకుండా ఆచరించి చూసి అప్పుడే నిర్ణయించుకొండి !

ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమేఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం,ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు :-

🔸1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
🔸2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
🔸3. అసత్య మాడరాదు.
🔸4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
🔸5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
🔸6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
🔸7. అన్నదానం చేయాలి.

ఒక్కటి గమనించండి... సనాతన భారతీయ ఆచారాలన్నీ పంచకోశ దేహ శుద్ధికోసమే!

  •       స్థూ ల దేహానికి ఆరోగ్యం,
  •  సూక్ష్మ దేహానికి( అనగా మనో ప్రాణాలకు)  ఉత్సాహం,ధైర్యం, విశ్వాసం, శ్రద్ధ ,
  • కారణ కోశానికి సంచిత కర్మ వినాశనం , చిత్త శుద్ధి , గుణ సంస్కార  పవిత్రత - వెరసి హృదయం లో యజ్ఞ భావం (పరోపకార బుద్ధి ,వివేక వైరాగ్యాలు  ) బలపడటం మనం గమనిస్తాం. 

ఆచార సంప్రదాయాలను ఆచరించి అందులో మీకేదైనా మూఢత్వం అనిపిస్తే సద్గురువులను సంప్రదించండి. అంతే తప్ప హేళన చేయకండి. మీకు ఆచారాలపై భక్తి శ్రద్ధ లుంటే మీ పిల్లలకు కూడా గురి కుదిరి ఆచారాలను పాటిస్తారు. 

ఆచార సంప్రదాయాలు జాతి కి, సమాజానికి,దేశానికి  జీవగర్ర ! 

దురాచారాలు , విదేశీ సంప్రదాయాలు జాతిని నిర్వీర్యం చేస్తాయనడానికి ప్రబలమైన ఉదాహరణ- కలోనియల్ ( బ్రిటిష్ ) దురాక్రమణ ద్వారా భారత సమాజం ఎంత దిగజారిపోయిందో, మాతృభాషను,మాతృ దేశాన్ని కించబరిచే మనస్తత్వాలు ఎంతగా పేట్రేగుతున్నాయో, స్వ ధర్మాన్ని హేళన చేస్తూ పరధర్మాన్ని పాటించడానికి  ఎంతగా ఉవ్విళూరు తున్నారో , మాతా పితరులను వదిలేసి కరడు గట్టిన స్వార్ధంతో భయంకర రాక్షసుల్లా బతికేస్తున్నారో ,  బానిస మనస్తత్వం తో నల్ల తోలును నిరసిస్తూ తెల్లతోలుకి,విదేశీ భాషకు ఎంతగా ఊడిగం చేస్తున్నారో  మనం చూస్తూనే ఉన్నాము. 

ఇప్పటికైనా మేల్కొందాం! మనలను మనమే సంస్కరించు కొందాం... 

చెప్పడానికి,వినడానికి కఠోరంగా ఉన్నా,  

"అన్ని మతాలు సమానం కానేకాదు. ఆత్మ ద్రుష్ట్యా అందరూ ఒక్కటైనా , పంచకోశ దేహా దృష్ట్యా చూస్తే అందరూ ఒక్కటి కాదు . ఎవరి అభిప్రాయాలు,ఎవరి మనోభావాలు వారికే గొప్పగా ఉంటాయి. పరమతాలను, ప్రవక్తలను, ఇతరుల మనోభావాలను గమనించి గౌరవించండి . నిరసించకూడదు. హేళన చేయకూడదు. అరచేతిలో వేళ్ళు ఎలా ఒకేరకంగా ఉండవో,భూమిపై మసిలే మానవజాతి ఒకేరకంగా ఉండదు. ఒకేరకంగా ఆలోచించరు . 

పరమతం లో సత్యధర్మాలంటే గౌరవించి ఆదరించండి. మనమాచరించే మతం లో ఏవైనా మూఢత్వం కనబడితే సద్గురువును సంప్రదించకుండా మీ అంతట మీరే నిరసించకూడదు. కొండ పాదంలో మసిలే వాడికంటే  కొండ శిఖరం పై ఉన్నవాడికి ఎక్కువ అవగాహన ఉంటుంది గదా? 

అంతేతప్ప శుష్క వాదనలతో సత్య ధర్మాన్ని , సనాతన ఆచారాలను ,  అసత్య ఆచారాలను ,అధర్మాలను ఒకే గాటన కట్టకండి. 

 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి