మానవ జన్మ లక్ష్యం - సాధన
ఓమ్ ... ప్రణవ నాదం తోనే సృష్టి ఆరంభం! బిందువుగా ఉన్న సత్య జ్ఞాన ఆనందము , అనంతంగా వ్యాపించి సత్య జ్ఞాన అనంతం బ్రహ్మ గా భాసించడమే సృష్టి! అలాగే సృష్టిలో ఏది చూసినా అణువు నుండి కణము వరకు,పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఒకే రకమైన నిర్మాణం చూడవచ్చు! సింపుల్ గా చెప్పాలంటే ,సృష్టి విన్యాసానికి ఒక నమూనా చూపాలంటే మానవదేహాన్ని పరిశీలించినా లేదా శ్రీ చక్రాన్ని తరచి చూసినా సరిపోతుంది.
మనం మానవులం కాబట్టి మానవ దృక్పధం తోనే అర్ధం చేసుకొంటాము. నామ రూప క్రియా విశేషాల మధ్యనున్న లావాదేవీలే ప్రాపంచికం,సంసారం ,లౌకికమూ ! జీవ జగత్ ఈశ్వరుల మధ్యన కదిలే నాటకమే సంసారం ! వెలుగు నీడల సయ్యాట ఈ లౌకిక ప్రపంచం! ఏకైక తత్త్వం , చిత్ సత్ అసత్ అనే త్రిపుటి గా భాసించడమే సృష్టి!
ఉన్నదొక్కటే తత్త్వం! కానీ మానవ మనస్సు దానిని విడదీసి చూస్తోంది.
విశ్వ స్థాయిలో మాట్లాడే మనిషి తన ఒంటి నీ,ఇంటినీ పట్టించుకోడు. ఇరుగు పొరుగు వారిని చూసి అసూయ పడతాడు. చూసిందల్లా కావాలని వెంపర్లాడుతూ ఉంటాడు. కోరుకొని ,కోపగించుకొని గిజగిజ లాడుతూ ఉంటాడు.
కరుడుగట్టిన వాసనల ప్రేరేపణతో ముసిరిన ఆలోచనలు మనస్సును ఊబి గా మార్చేసి వ్యక్తిత్వాన్ని అశాంతి లో ముంచేస్తాయి . మరి,వీటి నుండి మనిషికి విముక్తి లేదా?
ఉంది! ఉందని మహర్షులు మనకు గట్టి హామీ ఇచ్చారు. మనిషి లో ఉండవలసింది,ధృడమైన సంకల్పం!
సంకల్పం తోడైతే వేదం సిద్ధంగా ఉంటుంది!
వేదనాదం అనగా స్వరబద్ధమైన దివ్య శబ్దం . స్వరము
అంటే గతి ,లయ, శృతి ఉన్న అక్షర సంపుటి. ఇలాంటి అక్షర సముదాయాలను బీజములు, మంత్రములు, మాలలు, వాక్యాలు,
సూత్రములు,సూక్తములు,శ్లోకములు,పద్యములు,వచనములు ,అని చెప్పుకోవచ్చు.
అక్షర
పరిచితమైనది ఛందస్సు. మాత్ర స్వరూపమును నిర్ణయించునది ఛందస్సు. వాక్కు దానికి
స్థానము. ఛందోబద్ధమైనది మంత్రము. అట్టి మంత్రమే సాధకునికి శీఘ్ర ఫలప్రదమగును.
మంత్రానికి
ద్రష్ట లు మహర్షులు. తపోబలముచే నిరంతర సాధనాఫలితముగా మంత్రద్రష్టలై మంత్రఫలమును
అనుభవించువారు ఋషులు.
పరా ,పశ్యంతి , మధ్యమ, వైఖరీ అనేవి, ఒక శబ్దము గానీ ,రూపము గానీ ,క్రియలు గానీ సూక్ష్మతమ,సూక్ష్మతర,సూక్ష్మ,స్థూల దశలలో వ్యక్తమయ్యే దశలు .
నేను ఎవరు? ఎక్కడనుండి వచ్చాము ? తిరిగి ఎక్కడకి
పోతాము?భూమి అనే కర్మ గ్రహానికి రావడానికి కారణం ఏమిటి? మానవజన్మకు అర్ధము,పరమార్ధం ఉందా? ఉంటే కనుక అది ఏమిటి?--- మనన శీలత్వం ఉన్న మనస్సనే ఇంద్రియం ఉన్న మానవుడు తనకు ఊహ వచ్చినాక ఈ ప్రశ్నలు వేసుకొని,సమాధానం కోసం అన్వేషించాలి.
యద్భావం తద్భవతి ... అనే విశ్వ నియమం మరచిపోవద్దు!
భావనోపనిషత్ సారం ,మంత్రము ,మానసపూజ
ఇవన్నీ మన సూక్ష్మ కారణదేహాలను సచ్చిదానంద తత్వానికి అనుగుణ్యంగా కంపింప చేసే సాధనలే !
మన శక్తి దేహం యెక్క పౌనపుణ్యం , సచ్చిదానంద
తత్వపు పౌనపుణ్యం తో అనుకంపనం చెందడమే మోక్షం !
మనస్సులో ఉద్వేగాలు తక్కువ ఉండాలి. అనగా
సుఖసంతోషాలకు పొంగిపోవడం, బాధా దుఃఖాలకు,అవమానాలకు కుంగిపోవడం కాకుండా సమస్థితి ని అభ్యాసం
చేస్తూ ఉంటే అను ద్వేగకరమైన మానసం
సిద్ధిస్తుంది.
కామ క్రోధ మోహా లోభ మద మాత్సర్యాలను అదుపులో
పెట్టు కోవడానికి వివేకము,విచక్షణ, సత్ సాంగత్యం ,వైరాగ్యము తోడ్పడతాయి. తద్వారా
అహంకారం కరుగుతూ కరుగుతూ నిరహంకార స్థితి
సిద్ధిస్తుంది.
ప్రేమతో సేవ అనేది చిత్త శుద్ధి ని సిద్ధింప చేస్తుంది .
అరిషడ్వార్గాలు సమసిపోయి
అవన్నీ దైవంకోసం పడేతపన గా పరావర్తనం చెందాలి. ---- ముందు వీటిని
సాధించాలి. ఇ వన్నీ భగవంతుని పొందాలనే ప్రగాఢమైన ప్రేమ (భక్తి) తో నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలి.
దేనికోసం? భగవంతుని పొందడం కోసం!
అనగా నీ స్వ స్థితిని తెలుసుకోవడం కోసం! అనగా ముందు వేసుకొన్న ప్రశ్నలకు జవాబు
కోసం!
యజ్ఞమంటే నిస్వార్ధ అహంకార రహిత ఫలాపేక్ష రహిత కర్మానుష్టానం. దానం అంటే పాత్రత చూసి ఇచ్చే సాత్విక దానం. తపించడం అనగా అనన్య చింతన ! ఎవరిపైన?
భగవత్ తత్త్వం పైన నిరంతర చింతన ఉండాలి. కళ్ళెదురుగా భగవంతుడు లేకున్నా,ఆలంబనకోసం
విగ్రహాన్ని గానీ, యంత్రాన్ని గానీ నామ,కీర్తన,మంత్రం ఇలా దేనితోనైనా చింతన చేయడమే
తపస్సు!
మూడు కాలాలలో ,మూడు స్థితులలో ,మూడు కాయాలతో ,
మూడు కరణాలతో మూడుగుణాలను సమన్వయం చేసుకోవడమే సాధన!
సాధన దేనికోసం?
సాధకుని లక్ష్యం - వివేకం తో కూడిన వైరాగ్యం ,
నిశ్చలమానసం ,నిర్మల అంతకరణ ,!
వీటిని ఎలా సాధించాలి?
ఆధ్యాత్మిక శాస్త్ర పఠనం, సత్ సాంగత్యం, గురుబోధ,
శ్రవణం, మననం , ద్వారా అలవరచుకొన్న వివేక విచక్షణ లతో ప్రతి
బంధాన్ని,ప్రతి విజయాన్ని,అపజయాన్ని, ప్రతి సంఘటనను విచారించాలి.
ఇది శ్రేయస్సా? ప్రేయస్సా? ఇది సత్ ?అసత్ ? ఇది
నిత్యమా? అనిత్యమా? అనే తార్కిక విచారణ! మనస్సు చెప్పేది కాకుండా బుద్ధి చెప్పేది
ఆచరించాలి. మనస్సు ఎంతగా మౌనంగా ఉంటే బుద్ధి అంతగా ఆత్మగా ఉంటుంది!
ఇది నిరంతర అభ్యాసం తో
సాధ్యపడుతుందని వేరే చెప్ప నక్కరలేదు. దీనినే నిధి ధ్యాసన అనికూడా అంటారు.
మనస్సును ఎలా నిశ్చలం చేయాలి?
చలించడమే మనస్సు సహజ లక్షణం. అలాగని మరీ తుఫాన్
లు, సుడిగుండాలు ఉండకూడదు. రిథమిక్ చలనం అవసరం! సాత్విక దృష్టిని,దృక్పధాన్ని
ప్రయత్న పూర్వకముగా అలవాటు చేసుకోవాలి. తీవ్రమైన స్పందనలు హానికరం. తామస,రాజసిక
విషయాలు మానసిక స్పందనను తీవ్రతరం చేస్తాయి కాబట్టి సాత్విక విషయం చింతన అనేది
అభ్యసించాలి.
సృష్టిలో భగవత్ లక్షణాలను అభ్యసించడమే సాత్విక
విషయ చింతన!
భగవత్ లక్షణాలంటే ఏవి ?
ఉత్సాహం, కరుణ, సేవా తత్పరత ,ఓర్పు , ఏకాగ్రత,
ధ్యానం ,నిర్భయత్వం , నిర్మోహం, పరా జ్ఞానం !
మనస్సు సాధన చెప్పారు సరే! ప్రాణశక్తి సాధన ఎలా
చేయాలి?
మానవుడు మనో ప్రాణ
అపానములను ప్రయత్నపూర్వకంగా అదుపు
చేయవచ్చని శాస్త్రం చెబుతుంది. పంచ ప్రాణములలో కేవలం ప్రాణము,అపానము పైన వాలంటరీగా
కంట్రోల్ సాధించే అవకాశం ఉంటుంది. మిగతా 3 రకాల ప్రాణసంచలనం ( వ్యాన, ఉదాన, సమాన)
పై అదుపు సాధించలేము.
శక్తిప్రసరణ నాడుల వల ఒక సాలె గూడు అల్లిక లా దేహమంతటా వ్యాపించివుంటుంది . ఇందులో ఆన్ /ఆఫ్ స్విచ్ లెక్క పనిచేసే శక్తి ట్రాన్స్ ఫార్మర్లు ఉంటాయి. వీటినే చక్రాలు అంటారు.
72000 నాడులు,144 చక్రాలు ,వీటిలో ముఖ్యమైనవి 3 నాడులు, 6 చక్రాలు !
మనలోపల, మన చుట్టూ కాస్మిక్ శక్తి సముద్రం
ఉంటుందని మీకు తెలుసు!ఒక విధంగా సముద్రం లో చేప లెక్క, ఈ విశ్వ శక్తి కడలిలో
జీవులు జీవిస్తున్నాయి!
మానవ దేహంలో కి విశ్వశక్తి ప్రసరణ,ముఖ్యంగా
ఊర్ధ్వము గాఉన్న బ్రహ్మరంధ్రం నుండిగాని, మూలాధారం నుండిగాని జరుగుతుంది.
మనస్సు ఎంత నిశ్చలం,నిర్మలం గా ఉంటే అంతగా ఈ
విశ్వశక్తి మన శక్తిదేహంలోకి ప్రసరిస్తుంది.
అందుకే గాఢ నిద్రలోనూ , ధ్యాన స్థితి లో విశ్వశక్తి ధారాళం గా వస్తుంది.
విశ్వశక్తి అనేది జ్ఞాన శక్తి! అనగా జ్ఞానము మరియు
శక్తి కలగలిసిన అమృత శక్తి!
నిద్రలో విశ్వ జ్ఞాన శక్తి అందినా జ్ఞానము
అనేది మనం గ్రహించలేని స్థితిలో ఉంటాము. కేవలం ఎనర్జీ మాత్రమే గ్రహిస్తాము.అందుకే
నిద్రలేవగానే ఉత్సాహం గా ఉంటాము. ఉత్సాహం అనేది దివ్య లక్షణం అని మనం
చెప్పుకొన్నాం.
ధ్యానస్థితిలో జ్ఞానమును కూడా ఎనర్జీతో పాటు
గ్రహిస్తాం. . అందుకే కరుణ,నిరహంకారం, ప్రేమ,ఓర్పు అనే దివ్యలక్షణాలు అందుతాయి.
అదే దివ్య జ్ఞానం.
ప్రాణము ఊర్ధ్వ చలనం తోనూ, అపానము అధో చలనం తోనూ
ఉంటుంది. ఊర్ధ్వంగా చలిస్తే దానిని ప్రాణమనీ,అధో ముఖంగా చలిస్తే దానిని అపానమనీ
చెప్పుకొంటాం. ఊర్ధ్వరేతస్సు అనగా ప్రాణగమనాన్ని పూర్తిగా ఊర్ధ్వముఖంగా చలింపచేసి
భ్రూ మద్యం లో కేంద్రీకరించడం అనేది ఒక ప్ర క్రియ !
దైవం పట్ల అనన్య ప్రేమను కలిగిఉండటమే సద్భక్తి! .
భక్తులకు బ్రహ్మరంధ్రనుండి విశ్వశక్తి ధారాళంగా
అందుతుంది. వీరికి మనోప్రాణ సాధనలు
పెద్దగా అవసరం ఉండదు. మానవ అహం ఎంతగా తగ్గుతుందో అంతగా దివ్యశక్తి అందుతుంది.
దీనివలన మన మెదడులో నిద్రాణంగా ఉన్న కొన్ని
న్యూరల్ సెంటర్లు , పీనియల్ గ్రంథి ఉత్తేజం చెంది, అంతకు పూర్వం గ్రహించలేని స్పందన లను గ్రహిస్తాయి .
విశ్వం గురించి, జీవుల గురించి కొత్త
సమాచారం తెలుస్తుంది . దానితో సాధకుని దృక్పధం లో మరింత మార్పు వస్తుంది.
తోటి జీవులపట్ల మరింత ఉదారత,ప్రేమ ,ఓర్పు
కలుగుతాయి.
నేను అనే స్ఫురణ అనగా తాను ఆత్మ స్వరూపమే తప్ప మిగతా కోశములన్నీ వస్త్రాల వంటివేననే వాస్తవం
స్థిరపడుతుంది. అప్పుడు నిర్భయత్వం , నిర్మోహం ,తద్వారా ముక్తి స్థితి
స్థిరపడతాయి.
అహం అనే విత్తనాన్ని మన
అంతకరణ క్షేత్రం లో ఎప్పుడో నాటేసుకొన్నాం. ఆ విత్తనాన్ని మొలకెత్తించి ఫలసాయం
అందుకోవడానికి క్షేత్రం కావలిగదా,?అందుకే ఒక దేహాన్ని తొడుక్కున్నాం. అప్పుడు ఆ
విత్తనం నుండి మమకారం అనే కాండం
పుట్టింది. ఆ కాండానికి కుటుంబం,స్నేహితులు,బంధువులు,ఆస్తులు,కీర్తి ప్రతిష్టలు
అనే ఆకులు లెక్కకు మిక్కిలి చిగురించాయి. వాసనా సంస్కారాలు పుష్పాలుగా వికసించాయి.
పాపపుణ్యాలు ఫలాలుగా ఫలించాయి. ఈ దేహంలో ఉండగా చేసిన భౌతిక కర్మలు మళ్ళీ కొత్త విత్తనాన్ని తయారు
చేశాయి.
విత్తనాలను తయారు
చేయకూడదనుకొంటే అహాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. పాపపుణ్య కర్మలను భస్మీ పటలం చేసుకోవాలి.
ఇంత ఓపిక,తెలివి,ఓర్పు మాకు లేవు. మాకేకాదు 600 కోట్ల ప్రపంచ జనాభాలో 90 శాతం మందికి పైన చెప్పుకొన్న ప్రశ్నలు ఉదయించవు . ఉదయించినా, కనీస అవసరాలకోసం , పొట్టకూటి కోసం పడే ఆరాటం లో దానిని పట్టించు కోలేరు. మిగతా 10 శాతం లో ఒక్క శాతం తప్ప మిగతా 9 శాతము కనీస అవసరాలేకాదు, కోర్కెల జడివానలో చిక్కుకుపోతారు. మేమేమి చేయాలి?
ఈ 99 శాతం మంది , కనీసం భగవన్ నామ స్మరణ చేస్తూ వారి పనులు చేసుకొంటూ ఉండటమే వారికి తక్షణ పరిష్కారం . బతుకులో ఎదురయ్యే దానిని భగవత్ ప్రసాదం గా శ్వీక రించడం అభ్యాసం చేయాలి .
నేటి సైన్స్ ప్రకారం ప్రపంచమంతా దానికదే పరిణామం చెందింది తప్ప దీనికి మూలకారణం గానీ, అధికారి గానీ ఎవరూ ఉండనవసరం లేదు. అనవసరమైన విషయాలతో కాలయాపన చేయడం,సమస్యను గాలికొదిలెయ్యడం కాదా?
ఇసుక,ఇటుక,కంకర కుప్పలుగా పోసేస్తే ఇల్లు దానంతట అదే తయారైపోతుందా? విశ్వనిర్మాణం, విశ్వనియమాలకు లోబడి సాగుతున్న ఖగోళగతులు అణు ధర్మాలు అల్లా టప్పా గా గాలివాటం గా రాలేదు. అంతెందుకు, రోబో లను తయారు చేయాలంటే ఇంటెలిజెంట్ ప్రోగ్రామింగ్ అవసరం. అలాంటప్పుడు, పిపీలికాది మానవజాతి ని ఈ భూమండలం పై అవతరింప చేయాలంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ వ్రాయాలి? ఎంత పెద్ద ఇంటలిజెంట్ ప్రోగ్రామర్ అవసరం? ఆలోచించండి.
సమస్యలను ఎవరికీ వారే పరిష్కరించుకోమనే శాస్త్రం చెబుతుంది. దైవస్మరణ తో, దైవాజ్ఞగా, మీమీ పనులు చేసుకోమని సలహా ఇస్తుంది. కలిగే ఫలితం ఇష్టమైన,కష్టమైనా ప్రసాదం లెక్క తీసుకోమని చెబుతుంది తప్ప, సుఖం కలిగితే ఎగిరి ఎగిరి పడటం , కష్టమొస్తే కుంగిపో కూడదని శాస్త్రం గట్టిగ మందలిస్తుంది. కష్టనష్టాలతో ,అనారోగ్య బాధలతో ,అవమాన అసంతృప్తులతో,అశాంతి అలజడి తో గుండెల్లో చీకటి ముసిరినపుడు భగవంతుడనే కాంతిని హృదయం లో వెలిగించుకుని కర్తవ్యాన్ని వదిలిపెట్టకుండా బతుకులో పోరాటం చేయమనే శాస్త్రం గట్టిగ చెబుతుంది. అంతేగానీ, మా కర్మ ఇంతే అని చతికిల బడి సమయాన్ని వృధా చేయవద్దు. సమస్యలనుండి పారిపోవద్దు. కుంగిపోయి నిర్వేదం లోకి జారిపోవద్దు.
దైవం అంటే ఏమిటోకాదు , అశాంతి తో ఘోర్ణిల్లుతున్న మనస్సును నెమ్మది చేసి బుద్ధి అధీనం లో ఉంచడమే దైవ వైపు చూడటం. బుద్ధిని వివేకవంతంగా విచక్షణా పూర్వకముగా వినియోగించడమే దైవ స్మరణ. దేహానికే పరిమితమైన నేను' అనే అహాన్ని తగ్గించుకోవడమే దైవ చింతన.
సత్య జ్ఞాన అనంత ఆనంద పరబ్రహ్మ తత్వాన్ని ఇష్టదైవం లో (అనగా రాముడు,కృష్ణుడు,అల్లా,క్రీస్తు , బుద్ధుడు,మహావీరుడు,తీర్ధంకరులు ,నానక్) భావన చేస్తూ స్మరించు కొంటున్నా అదీ ఒక ఆధ్యాత్మిక సాధనే!
నిషిద్ధ కర్మలు చేయకూడదు. భగవత్ అపచారం, భాగవతులపట్ల అపచారం ,గురి నేర్పిన గురువు పట్ల అపచారం చేయకూడదు.
వాయువు ఎలాగైతే అశుద్ధం పైనా , పరిమళించే పూలపైనా ప్రసరిస్తుందో మనస్సు కూడా సుఖదుఃఖాల పై సమంగా ప్రసరించాలి. దేనినీ అంటి పెట్టుకోకూడదు.
ఇది చెప్పినంత సులువా ?
కానేకాదు! అందుకే బంధాల నుండి విడి వడటానికి నిరంతర అభ్యాసం అవసరం !
భూమి కర్మ క్షేత్రం. ఇది ప్రయోగశాల . మానవదేహం ధర్మ క్షేత్రం . మనోప్రాణములు సాధనా పరికరాలు. మనిషి జన్మ భోగం కోసం కాదు. యోగం
కోసమే ! మనిషి బుద్ధి జీవిగా ఎదగాలి. హృదయం వికసించాలి. సద్బుద్ధి తో
ధర్మ కర్మాచరణ అనుష్ఠించాలి. తద్వారా చిత్తశుద్ధిని సాధించాలి. సాధ నా సంపత్తి చేకూర్చు కోవాలి.
అప్పుడు బ్రహ్మజిజ్ఞాస !
Comments
Post a Comment